Chandrababu: ఇష్టముంటే ముద్దులు... లేకపోతే పిడిగుద్దులా?: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

  • జనభేరి సదస్సులో చంద్రబాబు ఫైర్
  • రైతులను విప్లవ వీరులతో పోల్చిన వైనం
  • అమర వీరులు, త్యాగధనులకు జోహార్ అంటూ నినాదాలు
  • ఇలాంటి ఉద్యమం ఇంకెక్కడా లేదని ఉద్ఘాటన
  • ఫేక్ సీఎం అంటూ జగన్ పై వ్యాఖ్యలు
  • రాజధాని ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
Chandrababu speech in Janabheri rally

అమరావతి ఉద్యమం నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన జనభేరి సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆవేశపూరితంగా ప్రసంగించారు. రాజధాని కోసం ఏడాది కాలంగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న అమరావతి రైతులు, మహిళలను చంద్రబాబు విప్లవ వీరులుగా అభివర్ణించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచే త్యాగధనులకు, అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు.

ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమం మరెక్కడా లేదని, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి ఉద్యమం కోసం వెదికితే అమరావతి ఉద్యమం ఒక్కటే కనిపిస్తుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. ఇష్టముంటే ముద్దులు పెడతాడు, లేకపోతే పిడిగుద్దులు గుద్దుతాడు అని విమర్శించారు.

"ఇవాళ సీఎం జగన్ ఓ సభలో ఏంమాట్లాడాడు? ఈ మహిళలు రియల్ ఎస్టేట్ మహిళలంట. ఇక్కడున్నవారంతా వ్యాపారస్తులేనంట. గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎవరైనా వ్యాపారస్తుడు ఉన్నాడంటే అది ప్రజల రక్తం తాగే జగన్ మోహన్ రెడ్డే. ఇక్కడ కులం ఉందా? జేఏసీ నేతలు శివారెడ్డి, శ్రీనివాస్ లది ఏ కులం? వాళ్లది రైతు కులం.. న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇక్కడికి కాంగ్రెస్ అగ్రనేతలు కూడా వచ్చారు. వాళ్లది ఏ కులం అని నేనడుగుతున్నా. త్యాగం చేసిన రైతులపై నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి.

ఇవాళ నేను ఉదయం ఇక్కడికి వచ్చేముందు కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నా. ఎందుకంటే... కనకదుర్గమ్మ మూడో కన్ను తెరిచి ఈ రాక్షసులను అంతుతేల్చి అమరావతికి విముక్తి కలిగిస్తుంది. ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూస్తే కడుపు తరుక్కుపోయింది. దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని, పవిత్ర జలాలను తీసుకువచ్చారు. ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి పవిత్ర మట్టిని తీసుకువచ్చారంటూ సాక్షాత్తు పార్లమెంటే మీకు అండగా ఉంటుందన్న భరోసానిచ్చారు. యమునా నది నుంచి నీళ్లు తెచ్చారంటే దైవబలం కూడా తోడు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.

నువ్వు నిజమైన ముఖ్యమంత్రివే అయితే, గాల్లో తిరిగే ఫేక్ సీఎం కాదని నిరూపించుకోవాలనుకుంటే నువ్వు గతంలో ఏంచెప్పావో గుర్తుచేసుకో. రాజధాని కోసం 30 వేల ఎకరాలైనా ఉండాలని నువ్వు అనలేదా? ఇప్పుడొచ్చి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటావా? నువ్వొచ్చి 19 నెలలైంది... ఏం సాధించావని నేనడుగుతున్నా. రైతులే ముందుకొచ్చి స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు ఇస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి మీకు నోరెలా వచ్చింది?" అంటూ చంద్రబాబు ఉద్రేకంగా ప్రసంగించారు.

More Telugu News