India: తొలి దశ టీకా ఇవ్వడానికి రూ.13,244 కోట్ల ఖర్చు... లెక్కలు కట్టిన కేంద్రం!

Above 12 Thousand Estimation for First Round Vaccination in India
  • ప్రాధాన్యతా క్రమంలో టీకాల పంపిణీకి ఏర్పాట్లు
  • ఖజానాపై పడే భారాన్ని ప్రస్తావించిన కేంద్రం
  • 8 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్లాన్
  • రేసులో ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్, భారత్ బయోటెక్
ఇండియాలో తొలి దశ కరోనా టీకాను ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు, అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చేందుకు 1.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13,244 కోట్లు) వరకూ ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సిన్ ప్రణాళికా పత్రాల్లో ఖజానాపై పడే భారాన్ని కూడా ప్రస్తావించినట్టు సమాచారం. వచ్చే ఆరు నుంచి 8 నెలల కాలంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్న ఇండియా, అందుకు తగ్గ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. అమెరికా తొలి స్థానంలో ఉంది. ఇక ఇండియాకు ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్, జైడస్ కాడిలాలు తయారు చేసిన వ్యాక్సిన్లతో పాటు దేశీయ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు.

ఇక, మొత్తం ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలంటే, ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి వుంటుందని ప్రభుత్వం తన రిపోర్టుల్లో పేర్కొన్నట్టు 'రాయిటర్స్' వార్తా సంస్థ వెల్లడించింది. ఫ్రంట్ లైన్ వర్కర్లు, రిస్క్ ఉన్న ప్రజలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలంటే, కనీసం 60 కోట్ల డోస్ లు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో కోవాక్స్ కేంద్రం నుంచి 19 నుంచి 25 కోట్ల వరకూ టీకా డోస్ లు కావాలని కేంద్రం కోరగా, 9.5 కోట్ల నుంచి 12.5 కోట్ల డోస్ ల వరకూ పంపగలమని ఆ సంస్థ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఇక గత సంవత్సరం బడ్జెట్ లో కేంద్రం ఆరోగ్య రంగానికి కేవలం రూ. 73 వేల కోట్లను మాత్రమే వెచ్చించగా, ఆ మొత్తం ఇప్పటికే ఖర్చయిపోయింది. దీంతో ప్రత్యేక అవసరాల కింద మరిన్ని నిధులను కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు అంటున్నారు.

India
Corona Virus
Vaccine
Treasury
Burden

More Telugu News