Bollywood: సినీ నటుడు సోనూసూద్‌కు హైదరాబాద్ కార్పెంటర్ అవార్డు బహూకరణ!

Bollywood actor Sonu Sood received padma seva award from carpenter
  • కరోనా కాలంలో మానవతావాదిగా నిలిచిన సోనూసూద్
  • కార్పెంటర్ చేతుల మీదుగా ‘పద్మ సేవా’ పురస్కారాన్ని అందుకున్న నటుడు
  • వినయంగా స్వీకరించిన సోనూపై ప్రశంసల వర్షం
కరోనా కాలంలో నేనున్నానంటూ ఎంతోమందిని ఆదుకుని, రియల్ హీరోగా వేనోళ్ల ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ కార్పెంటర్ అవార్డు బహూకరించాడు. సోనూసూద్ అతడిచ్చిన అవార్డును ఎంతో ప్రేమగా స్వీకరించాడు.  

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఇంద్రోజిర రమేశ్ వృత్తిరీత్యా కార్పెంటర్. చిన్నప్పటి నుంచి కష్టనష్టాలకోర్చి ఎదిగిన రమేశ్‌.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేవారన్నా, సామాజిక సేవలో మునిగి తేలేవారన్నా ఎంతో ఇష్టం. అలాంటి వారిని వెతికి స్వయంగా తయారుచేసిన బహుమతిని అందించి ‘పద్మసేవా’ అవార్డుతో సత్కరించడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు.

ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలోపల, బయట దాదాపు 95 మందిని రమేశ్ ‘పద్మసేవా’ పురస్కారంతో సత్కరించాడు. ఇలాంటి వారిలో ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేయించిన ప్రముఖ దర్శకుడు, నటుడు లారెన్స్, ‘నేను సైతం’తో పేదలకు అండగా నిలుస్తున్న మంచు లక్ష్మి, 220 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్, భిక్షాటన ద్వారా సంపాదించిన రూ. 3 లక్షలను సమాజసేవకు ఖర్చు చేసిన కామరాజు లాంటివారు ఉన్నారు.

ఇక, ఇటీవల కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తున్న నటుడు సోనూ సూద్‌ను కూడా సత్కరించాలని భావించిన రమేశ్.. అతడు హైదరాబాద్ రాగానే కలిసి తన అవార్డుతో సత్కరించాడు. కాగా, అసాధారణ సేవలతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి సంపాదించిన సోనూ సూద్‌ ఇటీవల అమెరికా నుంచి ప్రతిష్ఠాత్మక స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు కూడా అందుకున్నాడు.

అలాగే యూకేకు చెందిన ఈస్ట్రర్న్ ఐ పత్రిక టాప్-50 ఏషియన్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్‌లో సోనూకు అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. అలాంటి సోనూ ఓ కార్పెంటర్ ఇచ్చిన అవార్డును ఎంతో వినయంగా స్వీకరించడం అతడి గొప్పతనానికి నిదర్శనమని ప్రశంసిస్తున్నారు.
Bollywood
Sonu Sood
Hyderabad
Award
Carpenter
Padma seva award

More Telugu News