Corona Virus: జనవరిలో వుహాన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం.. కరోనా మూలాలు తెలుసుకోవడమే లక్ష్యం

  • డబ్ల్యూహెచ్ఓ బృందంలో ఎపిడెమాలజిస్టులు, జంతు ఆరోగ్య నిపుణులు
  • అనంతరం పలు దేశాల్లోనూ పర్యటన
  • కరోనా మూలాలపై ఇప్పటి వరకు స్పష్టత కరవు
WHO team to visit China in January to investigate coronavirus origin

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోనే పురుడుపోసుకుందన్న విషయం జగమెరిగిన సత్యం. అక్కడి వుహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి కకావికలు చేసింది. యూరప్, అమెరికా వంటి దేశాలను ఇప్పటికీ అది అతలాకుతలం చేస్తుండగా, కొన్ని దేశాల్లో మాత్రం కొంత నెమ్మదించింది.

 ఈ నేపథ్యంలో వైరస్ మూలాలను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం వచ్చే నెలలో వుహాన్‌లో పర్యటించనుంది. చైనాలో పర్యటించనున్న తమ బృందంలో ఎపిడెమాలజిస్టులు, జంతు ఆరోగ్య నిపుణులు కూడా ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి హెడిన్ హాల్‌డార్సన్ పేర్కొన్నారు.

కరోనా తొలి కేసు వుహాన్‌లో వెలుగు చూసింది. నిజానికీ మహమ్మారి గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించిందని చెబుతున్నప్పటికీ ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంతేకాదు, కరోనా నిజంగానే చైనాలో పుట్టిందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వుహాన్‌లో పర్యటన తర్వాత డబ్ల్యూహెచ్ఓ బృందం, వివిధ దేశాల్లోనూ పర్యటించి కరోనా మూలాలపై అధ్యయనం చేయనుంది.

More Telugu News