Geetha: ఆరేళ్ల వయసులో 15 ఏళ్ల క్రితం తప్పిపోయింది.. గీత మా బిడ్డే: యాకయ్య దంపతులు

  • గీత అసలు పేరు సౌజన్య
  • హైదరాబాద్‌లో తప్పిపోయింది
  • జీడిమెట్ల, కొంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాం
  • కంటి పక్కన, భుజంపైనా పుట్టుమచ్చలు
Geetha is our daughter says Mahabubabad couple

‘‘గీత మా అమ్మాయే. ఆరేళ్ల వయసులో 15 ఏళ్ల క్రితం తప్పిపోయింది. ఆమెకు మేం పెట్టుకున్న పేరు సౌజన్య. పాప తప్పిపోయినట్టు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. నెల రోజులపాటు వెతికాం. అయినా ఫలితం లేకుండా పోయింది’’.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని రాయినిపట్నానికి చెందిన కోల యాకయ్య, శాంత దంపతుల ఆవేదన ఇది.

భారత్ నుంచి తప్పిపోయి సరిహద్దు దాటి పాకిస్థాన్ చేరిన మూగ యువతి గీతను అప్పటి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చొరవ తీసుకుని తిరిగి స్వదేశానికి రప్పించారు. అప్పటి నుంచి గీత తమ కుమార్తేనంటూ పలువురు ముందుకొచ్చారు.

తన కుటుంబాన్ని, స్వగ్రామాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న గీతను ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంగళవారం బాసర తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టీవీ చానళ్లలో ప్రసారమైన వార్తను చూసిన యాకయ్య దంపతులు గీత తమ కుమార్తేనంటూ ముందుకొచ్చారు. గీత అసలు పేరు సౌజన్య అని, 2000వ సంవత్సరంలో తమకు జన్మించిందని చెప్పుకొచ్చారు.

ఆమె చిన్నప్పటి నుంచి మాట్లాడేది కాదని, సైగలు చేసేదని గుర్తు చేసుకున్నారు. ఉపాధి కోసం తాము హైదరాబాద్ వచ్చి సుచిత్రలో నివసించేవారమని చెప్పారు. సౌజన్యకు ఆరేళ్లున్నప్పుడు తాము పనికివెళ్లి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఆమె కనిపించలేదని, చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో జీడిమెట్ల, కొంపల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని వివరించారు.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె కనిపించకపోవడంతో తట్టుకోలేకపోయామన్నారు. అప్పటి నుంచి సౌజన్య దుస్తులను చూసుకుంటూ ఆ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. సౌజన్య ముఖంపై కుడివైపున కంటి పక్కన, కుడి భుజంపైనా పుట్టుమచ్చలు ఉన్నట్టు చెప్పారు. గీతను తమకు చూపిస్తే గుర్తు పడతామని యాకయ్య దంపతులు పేర్కొన్నారు.

More Telugu News