Rajinikanth: పార్టీ ప్రకటన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టండి: రజనీకాంత్ పార్టీపై ఆర్ఎంఎం స్పష్టీకరణ

  • మక్కళ్ సేవై కట్చికి ఆటో గుర్తు కేటాయించిన ఈసీ
  • రజనీ పార్టీ ఇదేనంటూ ప్రచారం
  • తాము చెప్పేదాకా ఆగాలన్న ఆర్ఎంఎం
  • పార్టీ పేరు, గుర్తు ప్రకటిస్తామని వెల్లడి
RMM says members must wait till official announcement

ఇటీవలే నమోదైన మక్కళ్ సేవై కట్చి (ఎంఎస్ కే) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తు కేటాయించిన నేపథ్యంలో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పేరు ఇదేనంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రజనీకాంత్ సామాజిక సేవా విభాగం రజనీ మక్కళ్ మండ్రం (ఆర్ఎంఎం) వివరణ ఇచ్చింది.

కొత్త పార్టీ పేరుపై అధికారిక ప్రకటన వచ్చే దాకా ఓపిక పట్టాలని సూచించింది. రజనీకాంత్ అభిమానులు, ఆర్ఎంఎం సభ్యులు పార్టీ పేరు ప్రచారంపై సంయమనం పాటించాలని, పార్టీ పేరు, గుర్తు ప్రకటించేదాకా ఆగాలని హితవు పలికింది. మీడియాలో వస్తున్న కథనాలను ప్రజలు మరింత వ్యాప్తి చేస్తున్నారని ఆర్ఎంఎం ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది.

బ్లాక్ బస్టర్ హిట్టయిన 'బాషా' చిత్రంలో రజనీకాంత్ ఓ ఆటోడ్రైవర్ పాత్ర పోషించారు. అందులో ఓ పాట కూడా 'నేను ఆటోవాడ్ని... ఆటోవాడ్ని' అంటూ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే రజనీ కొత్త పార్టీ గుర్తు ఆటోయేనని అభిమానులు నమ్ముతున్నారు.

More Telugu News