Jagan: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan launches YSR Crop Insurance Scheme in state
  • రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రారంభం
  • ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు పంట బీమా
  • రైతుల ఖాతాల్లో బీమా మొత్తం జమ
  • 2019 ఖరీఫ్ కు గాను 9.48 లక్షల మంది రైతులకు లబ్ది
  • ఇకపై రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం వెల్లడి
ఏపీలో మరో కొత్త పథకం షురూ అయింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. 2019 ఖరీఫ్ లో పంట నష్టపోయిన 9.48 లక్షల రైతుల ఖాతాల్లో ఈ పథకం ద్వారా రూ.1,252 కోట్లు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ పంటల బీమా పథకంతో పాలనా పరంగా మరో అడుగు ముందుకేశామని తెలిపారు. గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

గతంలో ఉన్న విధానం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతు కూడా తన వాటా ప్రీమియం చెల్లించాల్సి వచ్చేదని, బీమా సొమ్ము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. ఇప్పుడా పరిస్థితులను సమూలంగా మార్చివేశామని, రైతుల వాటా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్ వివరించారు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు రైతులకు గుదిబండ కాకూడదని, పంట నష్టపోతే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలని పేర్కొన్నారు.

గతంలో 20 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే, ఇప్పుడు 57 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదయ్యారని తెలిపారు. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని వెల్లడించారు.
Jagan
YSR Crop Insurance Scheme
Andhra Pradesh
Farmers
YSRCP

More Telugu News