Dirty Hari: ‘డర్టీ హరి’ సినిమా నిర్మాతపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

  • స్త్రీల గౌరవాన్ని అవమానించేలా పోస్టర్లు
  • నిర్మాత, పబ్లిషింగ్ ఏజెన్సీపై కేసులు నమోదు
  • శ్రుతిమించిన సీన్లతో ట్రైలర్
Jubilee Hills police files case against Dirty Hari movie producer

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి మెట్రో పిల్లర్లపై అతికించిన ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లు స్త్రీల గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సినిమా నిర్మాత శివరామకృష్ణతోపాటు పబ్లిషింగ్ ఏజెన్సీపైనా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు శ్రుతిమించి ఉండడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అలాగే, పోస్టర్లు కూడా మితిమీరి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు రూపొందించిన ఈ చిత్రంలో శ్రావణ్‌రెడ్డి, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. మార్క్ కె రోబిన్ సంగీతం సమకూర్చగా శివరామకృష్ణ, సతీశ్‌బాబు, సాయిపునీత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్‌ ద్వారా సినిమా విడుదల కానుంది.

More Telugu News