America: అమెరికాలో తొలి కరోనా టీకా వేయించుకున్న నర్స్.. ట్వీట్ చేసిన ట్రంప్!

Nurse in Queens hospital is first person took corona vaccine shot
  • అమెరికాలో ప్రారంభమైన సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమం
  • టీకా తీసుకున్న తర్వాత స్వస్థత లభించిందన్న నర్సు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన న్యూయార్క్ గవర్నర్ 
అనుకున్నట్టే అమెరికాలో ఫైజర్ టీకా అందుబాటులోకి వచ్చేసింది. కరోనా బారినపడి వణుకుతున్న అగ్రరాజ్యంలో నిన్న అతిపెద్ద సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి టీకాను ఓ నర్సుకు ఇచ్చారు. క్వీన్స్‌లోని లాంగ్ ఐలండ్ యూదు మెడికల్ సెంటర్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో పనిచేస్తున్న నర్సు శాండ్రా లిండ్రే ఫైజర్ టీకా తీసుకున్నారు. ఫలితంగా అమెరికాలో తొలి కొవిడ్ టీకా తీసుకున్న మహిళగా రికార్డులకెక్కారు. దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఆమె సేవలు అందిస్తూనే ఉన్నారు.

ఈ సందర్భంగా లిండ్సే మాట్లాడుతూ, టీకా తీసుకున్న తర్వాత ఉపశమనం లభించినట్టు అనిపించిందన్నారు. ఓ బాధాకరమైన సమయానికి ఇక ముగింపు లభిస్తుందని అన్నారు. టీకా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో మాట్లాడుతూ..ఈ ఆయుధం యుద్ధాన్ని ఆపుతుందని నమ్ముతున్నట్టు చెప్పారు. నర్సు తొలి టీకా తీసుకున్న అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

'తొలి టీకా వేశారు' అని పేర్కొన్న ట్రంప్.. 'అభినందనలు ప్రపంచమా' అని పేర్కొన్నారు. కాగా, టీకాను తాను కూడా తీసుకుంటానని ఫైజర్ సీఈవో అల్బర్ట్ బోర్లా ప్రకటించారు. టీకాను తయారు చేసిన కంపెనీ సీఈవోనే తీసుకుంటే, టీకాపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు.
America
Pfizer
vaccine
nurse
Donald Trump
vaccination

More Telugu News