Ayyanna Patrudu: ఏ2 ఆధ్వర్యంలో వేల ఎకరాలు కబ్జా చేశారు: అయ్యన్నపాత్రుడు

  • భూములు కాజేసేందుకే మూడు రాజధానుల డ్రామాలాడుతున్నారు
  • అమరావతి రైతులకు అందరూ అండగా నిలవాలి
  • ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలి
YSRCP grabbed thousands acres of land in Vizag says Ayyanna Patrudu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం అనాలోచితమైనదని చెప్పారు. విశాఖలో భూములు కాజేసేందుకే వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఏ2 విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖలో వేలాది ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.

రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అయ్యన్న అన్నారు. రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు ఏడాది కాలంగా ఉద్యమం చేస్తున్నారని... ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. భూములిచ్చిన రైతులను దుఃఖంలో ముంచిన ఘనత జగన్ దేనని అన్నారు. అమరావతి రైతులకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంఘీభావాన్ని ప్రకటించాలని చెప్పారు. అమరావతి విషయంలో ప్రధాని మోదీ మౌనాన్ని వీడి, స్పందించాలని డిమాండ్ చేశారు.

More Telugu News