Eswatini: కరోనాతో ఎస్వాటీనీ ప్రధాని కన్నుమూత

Eswatini PM dies in South African hospital with COVID
  • గత నెలలో కరోనా బారినపడిన ప్రధాని ఆంబ్రోస్ మాడ్వులో
  • రెండు వారాల తర్వాత దక్షిణాఫ్రికా ఆసుపత్రిలో చేరిక
  • పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి మృతి
ప్రపంచాన్ని కకావికలు చేస్తున్న కరోనా భూతం ఈసారి ఓ దేశ ప్రధానిని బలితీసుకుంది. ఆఫ్రికా దేశమైన ఎస్వాటీనీ ప్రధాని ఆంబ్రోస్ మాడ్వులో లామిని (52) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో నిన్న ఆయన తుది శ్వాస విడిచినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

 తాను కరోనా బారినపడినట్టు నవంబరు మధ్యలో ఆంబ్రోస్ వెల్లడించారు. అయితే, తనలో ఎటువంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నానని అప్పట్లో తెలిపారు. డిసెంబరు 1న ఆయన  పొరుగునే ఉన్న దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆంబ్రోస్ పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ దేశ ఉప ప్రధాని థెంబా మసుకు అధికారికంగా ప్రకటించారు.

వ్యాపారవేత్త అయిన లామిని బ్యాంకింగ్ రంగంలో 18 ఏళ్లపాటు సేవలు అందించారు. అనంతరం అక్టోబరు 2018లో ప్రధానిగా నియమితులయ్యారు. ఇక్కడ ప్రభుత్వ పనితీరు చాలా పరిమితంగా ఉంటుంది. 1986 నుంచి అధికారంలో ఉన్న రాజు ప్రధాని, మంత్రులను నియమిస్తారు. పార్లమెంటుపై ఆయనకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ఎస్వాటీనీ దేశ జనాభా దాదాపు 12 లక్షలు కాగా, ఇప్పటి వరకు 6,768 కరోనా కేసులు నమోదయ్యాయి. 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి జనాభాలో దాదాపు సగం మందికిపైగా దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నట్టు ప్రపంచబ్యాంకు తెలిపింది.
Eswatini
Prime Minister
Ambrose Dlamini
Corona Virus
passes away

More Telugu News