Andhra Pradesh: కోటి మందికి టీకా ఇచ్చేలా ప్లాన్ రెడీ చేసిన ఆంధ్రప్రదేశ్!
- మొత్తం 4,762 టీకా కేంద్రాల ఏర్పాటు
- ప్రతి కేంద్రంలో ఇద్దరు వ్యాక్సినేటర్లు
- నెల వ్యవధిలో తొలి దశ పూర్తి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కరోనా వ్యాక్సిన్ కోటాను అనుసరించి, ఏపీలో తొలి దశను ఒక్క నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల వ్యవధిలో కోటి మందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని, తొలి డోస్ తీసుకున్నాక 8 వారాలు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 4,762 కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, ప్రతి కేంద్రంలో ఇద్దరు చొప్పున మొత్తం 9,724 మంది వ్యాక్సినేటర్లను అందుబాటులోకి తేనున్నారు. వీరంతా ఒక్కొక్కరూ రోజుకు 70 మందికి టీకా వేసినా నెల రోజుల్లోనే కోటి మందికి టీకాలను వేయించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేటు, ఆరోగ్య రంగంలో ఉన్నవారితో పాటు అంగన్ వాడీ కార్యకర్తలు మొత్తం 3.66 లక్షల మందికి పైగా ఉండగా, వీరందరికీ తొలుత టీకా అందనుంది.
వీరి తరువాత పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులు ఉంటారు. టీకా తీసుకున్న తరువాత యాంటీ బాడీలు శరీరంలో పెరిగి, కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి కలిగేంత వరకూ మాస్క్ లు, భౌతికదూరం వంటివి పాటించడం తప్పనిసరని హెచ్చరించారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సమస్యలైనా ఏర్పడితే వెంటనే వారికి తగు వైద్య చికిత్సలను అందించేందుకూ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రిటైర్డ్ డాక్టర్లు, బీడీఎస్ వైద్యులు, ఫార్మాసిస్ట్ లు, నర్సింగ్, ఏఎన్ఎం విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది.