CPI Narayana: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • ఏపీ సర్కారు కోర్టులపై ఆగ్రహంగా ఉందన్న నారాయణ
  • నచ్చకపోతే తీసేద్దాం అనుకుంటున్నారని వెల్లడి
  • ఎస్ఈసీ విషయంలోనూ అదే జరిగిందని స్పష్టీకరణ
  • ప్రధాన న్యాయమూర్తి విషయంలోనూ అదే జరుగుతోందని వ్యాఖ్యలు
  • వీళ్లకు కేంద్రంలో మద్దతు ఉందని వివరణ
CPI Narayana sensational comments

సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరిని బదిలీ చేయబోతున్నారని, ఆ విషయం తనకు తెలుసని అన్నారు. కోర్టు తమకు అడ్డంగా ఉందని భావిస్తున్నారని ఆరోపించారు. తీర్పుల సందర్భంగా కోర్టులు విమర్శలు చేయడంలో తప్పేమీలేదని స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషనర్ ను రిలీవ్ చేసే అంశం తమ పరిధిలో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రిలీవ్ చేసిందని తెలిపారు. అయితే కోర్టు దీన్ని అడ్డుకోవడంతో సర్కారు భరించలేకపోతోందని, కోర్టు చట్టం గురించి మాట్లాడితే మీరు మాకు వ్యతిరేకం అంటూ కోర్టులనే ఆక్షేపిస్తున్నారని వివరించారు. చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ కోర్టులనే తప్పుబడుతున్నారని విమర్శించారు.

ఇప్పుడు అమరావతి అంశంలోనూ హైకోర్టు తమకు అడ్డంగా ఉందని భావిస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు తీసుకున్న భూమి తన సొంతానికి తీసుకోలేదని, రాజధాని కోసం తీసుకున్నారని వెల్లడించారు.

"రాజధానికి అడ్డం కొడుతుంటే కోర్టు ఆంక్షలు విధిస్తోంది. దాంతో వీళ్లు ఎన్నికల కమిషనర్నే కాదు, హైకోర్టు జడ్జిని కూడా తీసేద్దాం అనుకుంటున్నారు. తమకు నచ్చని జడ్జిని ట్రాన్స్ ఫర్ చేసేద్దాం అనుకుంటూ బరితెగించిన పద్ధతిలో ముందుకెళుతున్నారు. వీళ్లకు కేంద్రంలో కూడా మద్దతు ఉంది. ఎందుకంటే కేంద్రానికి ఓట్లు కావాలి, బలగం కావాలి కాబట్టి వీళ్లకు మద్దతిస్తున్నారు. దాంతో వీళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇక్కడో విషయం గమనించాలి... కోర్టులు జగన్ కు వ్యతిరేకం కాదు... జగన్ చేసే పనులకు మాత్రమే వ్యతిరేకం. తమకు నచ్చకపోయే సరికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లాగా హైకోర్టు జడ్జినే తీసిపారేద్దాం అనుకుంటున్నారు" అని వివరించారు.

ఇక రాజధాని అమరావతి రైతులు, మహిళల పోరాటాన్ని నారాయణ సమర్థించారు. రాజధాని కోసం అమరావతి రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటంలో న్యాయం ఉందని అన్నారు. ఏనాడూ బయటికి రాని మహిళలు వీధుల్లోకొచ్చి పోలీసులతో దెబ్బలు తింటూ, రౌడీలతో రాళ్లు వేయించుకుంటూ పోరాడుతున్నారని వెల్లడించారు. తిండీతిప్పలు లేకుండా, పండుగపబ్బాలు లేకుండా న్యాయం కోసం పోరాడుతున్నారని వివరించారు.

అలాంటివాళ్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని పాశవికంగా కాలరాస్తున్నారని నారాయణ విమర్శించారు. ఈ అరాచకం ఎన్నాళ్లో సాగదని స్పష్టం చేశారు. తాము కూడా రైతులకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి ఒకటే రాజధాని అని, మూడు రాజధానులంటూ ముదనష్టపు ఆలోచన చేయడం సరికాదని హితవు పలికారు.

More Telugu News