Dr Joseph Veron: వైద్యో నారాయణో హరి.... ఈ డాక్టర్ ను చూస్తే అది అక్షరసత్యం అనిపిస్తుంది!

US doctor works continuously without any leave for months
  • కరోనాతో హడలిపోతున్న అమెరికా
  • నిత్యం వేల సంఖ్యలో కేసులు
  • నిండిపోతున్న ఐసీయూలు
  • 260 రోజులుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న డాక్టర్ వెరోన్
  • ఒక్కరోజు కూడా సెలవుపెట్టని వైనం
  • రెండు, మూడు గంటలే నిద్ర
వైద్యుడ్ని భగవంతుడితో పోల్చడం వేదకాలం నుంచి ఉంది. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. ఇప్పటికీ కరోనాతో అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఓ డాక్టర్ ను చూస్తే అది అక్షరాలా నిజమనిపిస్తుంది. కరోనా ప్రభావంతో అమెరికా తల్లిడిల్లిపోతోంది. ఇప్పటికీ ప్రతిరోజూ వేలల్లో కొత్త కేసులు వస్తున్నాయి. వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ తమ శక్తికి మించి సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా టెక్సాస్ లోని హూస్టన్ లో ఉన్న యునైటెడ్ మెమోరియల్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ జోసెఫ్ వెరోన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అమెరికాలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆయన ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. 260 రోజులుగా ఆయన అవిశ్రాంతంగా ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఏది దొరికితే అది తినడం, రెండు, మూడు గంటలు నిద్రపోవడం, మిగిలిన సమయం అంతా కరోనా రోగుల సేవల్లో గడపడం... ఇదీ ఆయన దినచర్య. ఇటీవల జోసెఫ్ వెరోన్ కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది. ఓ కరోనా రోగిని ఆయన ఆత్మీయంగా హత్తుకున్న దృశ్యం అందరినీ కదిలించింది. దాంతో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ సదరు డాక్టర్ పనితీరును గమనించడానికి యునైటెడ్ మెమోరియల్ ఆసుపత్రికి వెళ్లింది.

డాక్టర్ జోసెఫ్ వెరోన్ అందిస్తున్న సేవలను చూశాక ఆ సంస్థ అచ్చెరువొందింది. ఆ మీడియా సంస్థ ప్రతినిధులు ఒకరోజంతా ఆసుపత్రిలో గడిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వెరోన్ వారితో మాట్లాడుతూ, ఎప్పుడో వీలైతే కొద్దిసేపు నిద్రపోతానని, ఏది దొరికితే అది తింటూ ఆకలి తీర్చుకుంటానని వెల్లడించారు. నెలల తరబడి కరోనా రోగులకు సేవలు అందిస్తూ తమ సిబ్బంది కూడా అలసిపోయారని, పని ఒత్తిడితో తమ నర్సులు విలపిస్తున్నారని తెలిపారు.

కేసులు వస్తూనే ఉండడంతో తాము నిర్విరామంగా పనిచేయాల్సి వస్తోందని, ఇటీవల తమ ఆసుపత్రిలో సేవలు అందించిన సైనిక వైద్య బృందం కూడా వెళ్లిపోయిందని, దాంతో తమపై మరింత భారం పెరిగిందని డాక్టర్ వెరోన్ పేర్కొన్నారు. కేసులు పెరగడానికి కారణం అమెరికా ప్రజలేనని, ముందు జాగ్రత్త చర్యలు పాటించని వారి నిర్లక్ష్యమే వారిని ఆసుపత్రుల పాల్జేస్తోందని విమర్శించారు. ఐసీయూలు నిండిపోతున్నాయని, మరికొన్ని నెలల పాటు ఇలాగే ఉంటుందని భావిస్తున్నామని, తమకు వృత్తి ధర్మం నిర్వర్తించడం మినహా మరో మార్గంలేదని ఆయన వివరించారు.
Dr Joseph Veron
Corona Virus
Pandemic
Texas
USA

More Telugu News