GVL Narasimha Rao: పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది: జీవీఎల్ ఆరోపణలు

  • తిరుపతిలో బీజేపీ నేతల ప్రెస్ మీట్
  • పోలీస్ స్టేషన్ల వేదికగా మతప్రచారం ఏంటని జీవీఎల్ ఆగ్రహం
  • ఇది సెక్యులరిజం అనిపించుకుంటుందా అని వ్యాఖ్యలు
  • దీన్ని బీజేపీ ఖండిస్తోందని వెల్లడి
  • తిరుపతి అభ్యర్థి ఎంపికకు సమయం పడుతుందని వివరణ
BJP leader GVL fires on AP Government

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లే వేదికగా ప్రభుత్వం మతప్రచారం చేస్తోందని అన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

గతంలో వ్యక్తిగతంగా మాలలు వేసుకున్న వారిని, బొట్టు పెట్టుకున్న వారిని కూడా అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయని, మరి పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ ఎలా జరుపుతారని ప్రశ్నించారు. ఇది లౌకికవాదం అనిపించుకుంటుందా అని నిలదీశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రయిక్ చేస్తే, ఏపీలో రెండు సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని పేర్కొన్నారు.

ఇక, తిరుపతి ఉప ఎన్నిక గురించి కూడా జీవీఎల్ స్పందించారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. అయితే ఇక్కడ్నించి పోటీ చేయాలని తాము ఆసక్తిగా ఉన్నామని, అయితే జనసేన నాయకులు ఢిల్లీలో తమ పార్టీ పెద్దలను కలిశారని జీవీఎల్ చెప్పారు. అందుకే తిరుపతి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎంపికకు మరికొంత సమయం పడుతుందని అన్నారు.

More Telugu News