Rohit Sharma: ఫిట్ నెస్ టెస్ట్ పాసైనా... రోహిత్ శర్మపై బీసీసీఐ క్లారిటీ!

  • తుది నిర్ణయం వైద్య బృందానిదే
  • క్వారంటైన్ తరువాతే మరో పరీక్ష
  • మూడో టెస్ట్ ఆడే విషయంలో వీడని సస్పెన్స్
BCCI Latest Clarity on Rohit Sharma

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో పాల్గొనేందుకు డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ టెస్ట్ పాస్ అయినప్పటికీ, అతను ఆడే విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. రోహిత్ ఆసీస్ కు వెళుతున్నాడని స్పష్టం చేసిన బీసీసీఐ, అతను మూడో టెస్ట్ నుంచైనా బరిలోకి దిగుతాడా? అనే విషయంలో తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని, జట్టుతో పాటు ఉన్న డాక్టర్ల బృందం రోహిత్ ఫిట్ నెస్ ను మరోసారి పరీక్షించిన తరువాతే విషయం స్పష్టమవుతుందని వెల్లడించింది. కాగా, ఆసీస్ కు వెళ్లనున్న రోహిత్, అక్కడి నిబంధనల ప్రకారం రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో అతను తొలి రెండు టెస్టులూ ఆడే అవకాశాలు లేవు.

ఐపీఎల్ ఆడుతున్న సమయంలో గాయపడిన రోహిత్ శర్మ, ఆపై చికిత్స తరువాత, రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని బృందం పరీక్షించి, ఆడేందుకు ఫిట్ గా ఉన్నాడని తేల్చగా, ఆసీస్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇదే సమయంలో సుదీర్ఘ సమయం బరిలోకి నిలవాలంటే, రోహిత్ ఫిట్ నెస్ మరింతగా మెరుగుపడాల్సి వుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ వైద్య బృందం ఆసీస్ లో రోహిత్ క్వారంటైన్ ముగిసిన తరువాత మరోసారి వికెట్ల మధ్య పరిగెత్తే సమయాన్ని పరీశీలించి, మ్యాచ్ లో బరిలోకి దించాలా?వద్దా?అన్న విషయాన్ని తేల్చనుంది. తొలి టెస్ట్ తరువాత విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి రానుండగా, ఆపై రోహిత్ కెప్టెన్సీలో ఇండియా మ్యాచ్ లను ఆడుతుందని తొలుత భావించారు. అయితే, మూడవ టెస్ట్ కు మాత్రమే రోహిత్ అందుబాటులోకి వస్తాడని తెలుస్తుండగా, రెండో టెస్ట్ వీరిద్దరి గైర్హాజరీలోనే సాగనుంది.

More Telugu News