Neeraj: గొడవను ఆపేందుకు వెళ్లిన పర్యవసానం... 22 కత్తిపోట్లు!

  • ఢిల్లీలో ఘటన
  • ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులపై దాడి
  • తమ ఉద్యోగాలను కొట్టేశారని కసి
  • గొడవ మధ్యలో వెళ్లి బలైన యువకుడు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Youth stabbed to death after he intervened into a brawl

తన స్నేహితులపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన యువకుడు విషాదకర రీతిలో హతుడైన ఘటన ఢిల్లీలో జరిగింది. ముఖేశ్, రాకేశ్ అనే వ్యక్తులు ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. గతంలో ఇదే ఆసుపత్రిలో కృష్ణన్, రవి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు. అయితే వారిద్దరినీ తొలగించిన ఆసుపత్రి యాజమాన్యం రాకేశ్, ముఖేశ్ లను నియమించుకుంది. తమ ఉద్యోగాలను కొట్టేశారన్న ఉద్దేశంతో కృష్ణన్, రవి... ముఖేశ్, రాకేశ్ లపై కక్ష పెంచుకున్నారు.

ఈ నేపథ్యంలో, బుధవారం రాత్రి ముఖేశ్, రాకేశ్ తమ విధులు ముగించుకుని తమ మిత్రుడు నీరజ్ తో కలిసి ఇంటికి వెళుతున్నారు. దారి మధ్యలో కాపుకాసిన కృష్ణన్, రవి.... ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఆపి ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో, ఘర్షణ మరింత ముదరకుండా చేద్దామన్న ఉద్దేశంతో నీరజ్ జోక్యం చేసుకున్నాడు.

దాంతో తీవ్ర కోపోద్రిక్తులైన కృష్ణన్, రవి కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో నీరజ్ కు 22 కత్తిపోట్లు తగలగా తీవ్రరక్తస్రావంతో అతడు మరణించాడు. అటు, రాకేశ్, ముఖేశ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా ఈ దాడిలో కృష్ణన్, రవిలతో పాటు ఓ మైనర్ బాలుడు కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణన్, రవిలను అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News