Natti Kumar: అగ్ర నిర్మాతలపై ఫైర్.. ఫిలింఛాంబర్ పదవికి నిర్మాత నట్టి కుమార్ రాజీనామా!

  • స్వార్థ ప్రయోజనాల కోసం పరిశ్రమను నాశనం చేస్తున్నారన్న నట్టి కుమార్
  • థియేటర్లు ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నిరాశలో ఉన్నారని వ్యాఖ్య
Producer Natti Kumar resigns for Film Chamber

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ని వరుస వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. పరిశ్రమలోని పలువురి మధ్య ఎన్నో విభేదాలు చోటు చేసుకున్నాయి. బహిరంగంగానే ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి.

తాజాగా... ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరిశ్రమను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ... తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ పదవికి నిర్మాత నట్టి కుమార్ రాజీనామా చేశారు. దీంతో పాటు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈనెల 7నే రాజీనామా చేసిన ఆయన... ఈరోజు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు.

సినిమా థియేటర్లను ప్రారంభించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా... కొందరు సినీ పెద్దల వల్ల ఇంత వరకు థియేటర్లలోకి సినిమాలు రాలేదని నట్టి కుమార్ మండిపడ్డారు. వారి వల్ల థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది తీవ్ర నిరాశలో కూరుకుపోయారని అన్నారు.

స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పెద్ద నిర్మాతలు 2021 మార్చ్ వరకు థియేటర్లను మూసి ఉంచేలా ప్రయత్నిస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. వీరివల్లే థియేటర్లలో సినిమాలు విడుదల కావడం లేదని దుయ్యబట్టారు. ఈ కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ అంశాలపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, చర్చించాలని ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీలను నట్టి కుమార్ కోరారు. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Telugu News