Monolith: ఈసారి పోలెండ్ లో ప్రత్యక్షమైన మిస్టరీ దిమ్మె!

Mystery monolith appears this time in Poland
  • వార్సాలోని విస్టులా నదీ తీరంలో దిమ్మె
  • దిమ్మెను గుర్తించిన పౌరుడు
  • ఇది అసాధారణంగా ఉందన్న అధికార యంత్రాంగం
  • ఇప్పటికే పలు దేశాల్లో లోహపు దిమ్మెల ప్రత్యక్షం
  • కొన్నిరోజులకే మాయమవుతున్న వైనం

గత కొన్నిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ప్రత్యక్షమవుతున్న లోహపు దిమ్మెల మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. తాజాగా ఓ లోహపు దిమ్మె పోలెండ్ లో ప్రత్యక్షమైంది. పోలెండ్ రాజధాని నగరం వార్సాలోని విస్టులా నదీతీరం వద్ద ఇది దర్శనమిచ్చింది. నదీ తీరం వెంబడి ఉదయపు పరుగు కోసం వెళ్లిన ఓ వ్యక్తి ఈ ముక్కోణాకారపు దిమ్మెను గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. పది అడుగుల ఎత్తున్న ఈ దిమ్మె వెండి రంగులో కనిపించింది. ఈ లోహపు ఆకారాన్ని ఎవరు అక్కడ పాతి ఉంటారన్న దానిపై ఇంతవరకు సమాచారం లేదు.

దీనిపై విస్టులా జిల్లా అధికార యంత్రాంగం ఫేస్ బుక్ లో స్పందించింది. తీరంలో అసాధారణరీతిలో ఉన్న ఓ మిస్టరీ దిమ్మె కనిపించిందని, విస్టులా నదీతీరానికి విహారానికి వచ్చేవాళ్లు దీన్ని చూడకుండా ఉండలేరని పోస్టు చేసింది.

ఇలాంటి దిమ్మె మొట్టమొదట అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో గుర్తించారు. కొన్నిరోజులకే అది అక్కడ్నించి మాయమైంది. ఆ తర్వాత యూరప్ లోని పలుదేశాల్లోనూ, దక్షిణ అమెరికా దేశాల్లోనూ ఇలాంటివే కనిపించడం, కొన్నిరోజులకే మాయం కావడం జరుగుతోంది. ఇది గ్రహాంతరజీవుల పనే అని వాదనలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News