Corona Virus: అమెరికాను మళ్లీ వణికిస్తున్న కరోనా వైరస్.. నిన్న ఒక్క రోజే 3 వేలకు పైగా మరణాలు

  • అమెరికాలో ప్రతి రోజు వేలాది మరణాలు
  • ఇప్పటి వరకు 2,86,249 మంది మృతి
  • వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి 100 మిలియన్ల మందికి టీకా
corona killed 3 thousand people in america in 24 hours

అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వేలాది ప్రాణాలను బలితీసుకుంటోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 3,054  కరోనా మరణాలు సంభవించాయి. అంతకు 24 గంటల ముందు 2,769 మంది కరోనా కాటుకు బలయ్యారు. 18 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 2,10,000 మందికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అమెరికాలో ఇప్పటి వరకు 1.50 కోట్ల మంది వైరస్ బారినపడగా, వారిలో 2,86,249 మంది వైరస్‌కు బలైనట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.

నేడో, రేపో అమెరికాలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్న వేళ, కరోనా దెబ్బకు ప్రతి రోజూ వేలాదిమంది మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి 20 మిలియన్ల మందికి, జనవరి చివరినాటికి 50 మిలియన్ల మందికి, వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి 100 మిలియన్ల మంది అమెరికన్లకు కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆ దేశ ఆరోగ్య, మానవసేవల కార్యదర్శి అలెక్స్ అజార్ తెలిపారు. ఇందుకోసం తగినన్ని డోసులను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. టీకాలకు అనుమతి లభించిన వెంటనే పని ప్రారంభించనున్నట్టు మరో అధికారి వివరించారు.

More Telugu News