Mamata Banerjee: నడ్డా, గడ్డా, చడ్డా... ఇలా ఎవరెవరో రాష్ట్రానికి వస్తున్నారు: సీఎం మమత సెటైర్లు

  • బెంగాల్ లో నడ్డా కాన్వాయ్ పై దాడి
  • వీళ్లకేం పనిలేదంటూ మమత ధ్వజం
  • ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రానికి వస్తుంటారని వ్యాఖ్యలు
  • వీళ్ల సభల్లో జనాలుండరని ఎద్దేవా 
  • కార్యకర్తల హడావుడి తప్ప ఇంకేమీ ఉండదని వ్యంగ్యం 
Mamata Banarjee satires on BJP leaders in a funny way

పశ్చిమ బెంగాల్ లో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై తీవ్ర దాడి జరిగిందని బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, అది జేపీ నడ్డాను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నమేనని బీజేపీ పెద్దలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీళ్లకేం పనిలేదని, ఒకసారి హోంమంత్రి వస్తారని, ఆ వెంటనే నడ్డా, గడ్డా, చడ్డా, ఫడ్డా... ఇలా ఎవరెవరో రాష్ట్రానికి వచ్చివెళుతుంటారని వ్యంగ్యంగా అన్నారు.

ఒకరు వచ్చిపోగానే, మరొకరు వస్తుంటారని విమర్శించారు. వాస్తవానికి వాళ్ల సభలో జనాలు పెద్దగా ఉండరు కానీ, వాళ్ల కార్యకర్తలు చేసే హడావుడి అంతాఇంతా కాదని ఎద్దేవా చేశారు. నడ్డాపై దాడి ప్రణాళిక ప్రకారం జరిగిందంటున్నారని, కేంద్ర బలగాలన్నీ బీజేపీ చేతుల్లోనే ఉన్నప్పుడు ఎందుకు ఈ దాడిని అడ్డుకోలేకపోయారని మమత కమలనాథులను ప్రశ్నించారు.

అయితే, నడ్డా కాన్వాయ్ పై దాడికి కారణం ఓ యాక్సిడెంట్ అయ్యుండొచ్చని, ఆ కాన్వాయ్ లోని వాహనాలు ఎవరినో ఢీకొట్టడం వల్ల పెల్లుబుకిన ఆగ్రహమే దాడికి దారితీసి ఉండొచ్చని అన్నారు. 'మీరు చెప్పే అబద్ధాలను మేం సహించబోం.. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలేంటో తెలుస్తాయి' అని దీదీ స్పష్టం చేశారు.

More Telugu News