JP Nadda: డైమండ్ హార్బర్ కు వెళ్లే దారిలో జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్ల వర్షం

Stone pelting against JP Nadda convoy in West Bengal
  • పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న జేపీ నడ్డా 
  • వాహనం అద్దాలు ధ్వంసం
  • అమిత్ షాకు లేఖ రాసిన పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్
  • నడ్డాకు మమతా సర్కారు సరైన భద్రత కల్పించడంలేదని ఆరోపణ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య వైరం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే అనేక పర్యాయాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు కూడా నమోదయ్యాయి. తాజాగా, పశ్చిమ బెంగాల్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిసింది. నడ్డా 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ ప్రాంతానికి వెళుతుండగా ఓ సమూహం ఆయన కాన్వాయ్ పై దాడికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.

కాగా, ఆ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. కొందరు వ్యక్తులు పెద్ద ఇటుకల సైజులో ఉన్న రాళ్లను వాహనాలపైకి విసిరారు. ఈ మేరకు ఓ వీడియోలో వెల్లడైంది. ఈ దాడిపై బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జేపీ నడ్డా రెండ్రోజుల పర్యటన కోసం పశ్చిమ బెంగాల్ రాగా, ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆ లేఖలో పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. నిన్న జేపీ నడ్డా పాల్గొన్న కార్యాక్రమాల వద్ద పోలీసులే కనిపించలేదని తెలిపారు.
JP Nadda
Convoy
Stone Pelting
Diamond Harbour
West Bengal
BJP
Mamata Banerjee

More Telugu News