ఇటీవలే నిశ్చితార్థం.. హోటల్ గదిలో తమిళ యువ నటి అనుమానాస్పద మృతి!

09-12-2020 Wed 12:59
  • కాబోయే భర్తతో కలిసి హోటల్‌లో ఉన్న వీజే చిత్ర
  • స్నానం కోసం వెళ్లి, బాత్ రూంలో ఉరి
  • హోటల్‌ సిబ్బందికి తెలిపిన కాబోయే భర్త
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
chitra commits suicide

తనకు కాబోయే భర్తతో కలిసి ఉన్న ఓ హోటల్‌లో తమిళనటి వీజే చిత్ర (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవలే వ్యాపారవేత్త హేమంత్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. చెన్నైలోని ఓ హోటల్ లో హేమంత్‌తో ఆమె ఉంటోంది. అయితే, ఈ రోజు ఉదయం స్నానం కోసం వెళ్లిన ఆమె బాత్ రూమ్ లోంచి తిరిగిరాలేదు. దీంతో హేమంత్‌ హోటల్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మరో తాళం చెవితో వారు గది తలుపులు తెరిచారు.

ఆమె చీరతో ఉరి వేసుకుని కనిపించడంతో వారంతా షాక్ అయ్యారు. పాప్యులర్ టీవీ షో 'పాండ్యన్ స్టోర్స్‌'తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. త‌మిళ టీవీ రంగంలో ఎంతో పాప్యులారిటీ తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో కూడా ఆమె న‌టించింది. ఆమె ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.