Parthiv Patel: అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు పార్థివ్ పటేల్ గుడ్ బై!

Parthiv Patel announces retirement from all formats of the game
  • 17 ఏళ్ల వయసులోనే టీమిండియాలో చోటు
  • 2002లో న్యూజిలాండ్ తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ
  • 2003 ప్రపంచ కప్ స్క్వాడ్ కూ ఎంపిక
  • 25 టెస్టులు, 38 వన్డేలు, 2 వన్డేలు ఆడిన వికెట్ కీపర్
అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ ఏడాది మహేంద్ర సింగ్‌ ధోనీ, సురేశ్‌ రైనా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అదే బాటలో పయనిస్తూ మరో క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. టీమిండియా వికెట్‌ కీపర్‌ పార్థివ్ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.

తనపై భారత క్రికెట్ నమ్మకాన్ని ఉంచి 17 ఏళ్ల వయసులోనే అవకాశం కల్పించిందని ఆయన ఈ సందర్భంగా అన్నాడు. తన క్రికెట్ జర్నీలో సాయపడ్డ కుటుంబ సభ్యులకు ఆయన థ్యాంక్స్ చెబుతూ వారి ఫొటోలు పోస్ట్ చేశాడు. ఆయన 2002లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచుతో వన్డే క్రికెట్లోకి ప్రవేశించాడు.

2003 ప్రపంచ కప్ స్క్వాడ్ కూ ఎంపికయ్యాడు. అయితే, మ్యాచుల్లో ఆడే అవకాశం ఆయనకు రాలేదు. ఆయన వికెట్ కీపర్ కావడంతో టీమిండియా తరఫున ఆడే అవకాశాలు ఆయనకు అంతగా రాలేదని చెప్పాలి. ఎందుకంటే వికెట్ కీపర్లుగా మొదట రాహుల్ ద్రవిడ్, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. అంతేగాక, దినేశ్ కార్తీక్ కూడా జట్టులో రాణించి పాతుకుపోయాడు.

వారి స్థానంలో పార్థివ్ పటేల్‌ను తీసుకునే అవకాశాలు రాలేదు. తనకు ఆడే అవకాశం వచ్చిన మ్యాచుల్లో మాత్రం తనను తాను నిరూపించుకున్నాడు. ఆయన తన కెరీర్లో మొత్తం ‌ 25 టెస్టులు, 38 వన్డేలు  ఆడాడు. టెస్టుల్లో ఆయన మొత్తం 934 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ గా 62 క్యాచులు పట్టాడు. వన్డేల్లో మొత్తం 736 పరుగులు చేసి, 30 క్యాచులు పట్టాడు.

ఆయనకు టీమిండియా తరఫున కేవలం రెండు టీ20 మ్యాచుల్లోనే ఆడే అవకాశం వచ్చింది.  తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. ఆయన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, డెక్కన్‌ చార్జర్స్‌ జట్లలో ఆడిన విషయం తెలిసిందే.  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆయన మొత్తం 187 మ్యాచుల్లో 10,797 పరుగులు చేశాడు.
Parthiv Patel
Cricket
India
Team India

More Telugu News