Russia: రష్యాలోని బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆకాశంలో వెలుగుపూలు!

fireworks factory explodes in Russia sending thousands of rockets into the skies
  • నూతన సంవత్సర వేడుకల కోసం పెద్ద ఎత్తున బాణసంచా తయారీ
  • ప్రమాదం కారణంగా నింగిలోకి దూసుకెళ్లిన వేలాది రాకెట్లు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
రష్యాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం ఆకాశంలో వెలుగుపూలు పూయించింది. ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో నిల్వచేసిన రాకెట్లకు నిప్పు అంటుకోవడంతో వేలాది రాకెట్లు నింగిలోకి దూసుకెళ్లి మిరుమిట్లు గొలిపాయి. దక్షిణ రష్యాలోని పోర్టు సిటీ అయిన రోత్సోవ్-ఆన్-డాన్‌లో జరిగిందీ ఘటన. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో ఆకాశం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నూతన సంవత్సరం వేడుకల కోసం బాణసంచాను పెద్ద ఎత్తున నిల్వచేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో భయపడిన ప్రజలు పరుగులు తీశారు. అయితే, ఆ తర్వాత బయటకు వచ్చి రాకెట్ల పేలుళ్లతో వివిధ రంగులతో అత్యంత సుందరంగా కనిపిస్తున్న నింగిని వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, వందలాది రాకెట్లతో కూడిన బాణసంచా నింగిలోకి దూసుకెళ్తుండడంతో వారికి సాధ్యం కాలేదు. దీంతో అదనపు సిబ్బందిని రప్పించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం 400 మంది అగ్నిమాపక సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Russia
Fireworks
Fire Accident

More Telugu News