Vijayashanti: బీజేపీలో చేరిన విజయశాంతి.. కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రాములమ్మ

Vijayashanthi fires on KCR after joining BJP
  • తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని కేసీఆర్ ఒత్తిడి తెచ్చారు
  • సోనియాగాంధీని కేసీఆర్ మోసం చేశారు
  • రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

1998 జనవరిలో బీజేపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తన వంతుగా ఎంతో కృషి చేశానని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి, తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని కేసీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ కంటే ముందు నుంచే తాను తెలంగాణ కోసం పోరాడుతున్నానని చెప్పారు. తొలుత టీఆర్ఎస్ నుంచి తాను, కేసీఆర్ ఇద్దరం ఎంపీలుగా గెలిచామని అన్నారు. 2013 జూలైలో తనను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారని తెలిపారు. తొలి నుంచి కూడా కేసీఆర్ తనపై కుట్ర పూరితంగానే వ్యవహరించారని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి తానే బయటకు వెళ్లానని దుష్ప్రచారం చేశారని అన్నారు.

తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని సోనియాగాంధీకి చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఆమెను మోసం చేశారని విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు ఎవరూ ఉండకూడదనే ఆలోచనతో ఇతర పార్టీల నేతలందరినీ టీఆర్ఎస్ లోకి కేసీఆర్ చేర్చుకున్నారని చెప్పారు. తెలంగాణలో పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందని... కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెడతానని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా కీలక పాత్రను పోషిస్తానని తెలిపారు.
Vijayashanti
BJP
Congress
KCR
TRS

More Telugu News