UNDP: కరోనా ఎఫెక్ట్: 2030 నాటికి 100 కోట్ల మంది కటిక పేదరికంలోకి: ఐక్యరాజ్య సమితి హెచ్చరిక

Covid19 could push over 1 billion in extreme poverty by 2030
  • దిగ్భ్రాంతికి గురిచేస్తున్న యూఎన్‌డీఏ నివేదిక
  • అంచనాలను తారుమారు చేసిన కరోనా మహమ్మారి
  • సుస్థిరాభివృద్ధి సాధనకు నూతన విధానం చూపించిందన్న యూఎన్‌డీపీ
ప్రపంచంపై కరోనా ప్రభావం ఎంత దారుణంగా ఉందో చెబుతూ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించిన విషయాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ప్రజలు కటిక పేదరికంలోకి జారుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే పేదరికంలో ఉన్నవారిని కలుపుకుంటే 2030 నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి కరోనా ముందునాటి అంచనాల ప్రకారం 2030 నాటికి నాలుగు కోట్ల మంది మాత్రమే పేదరికం అనుభవిస్తారని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది.

అయితే, కరోనా మహమ్మారి ప్రపంచంపై పడడం, మరణాల రేటు, అభివృద్ధి అంచనాలు కలిపి దీనిని తారుమారు చేశాయి. మరణాల నష్టం ఎక్కువగా ఉండి, కరోనా నుంచి కోలుకునేందుకు సుదీర్ఘకాలం పడితే కనుక 2030 నాటికి 20 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని యూఎన్‌డీపీ నివేదిక వెల్లడించింది.

కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభ ప్రభావం మరో పదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, సుస్థిరాభివృద్ది లక్ష్యాలను సాధించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తే కనుక దీని నుంచి తొందరగానే బయటపడవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి విలయం సృష్టించినప్పటికీ సుస్థిరాభివృద్ధి సాధనకు నూతన విధానంలో ముందుకెళ్లే అవకాశాన్ని కల్పించిందని పేర్కొంది.
UNDP
poverty
UNO
COVID19

More Telugu News