Kalyani Dam: 15 ఏళ్ల తర్వాత చిత్తూరు కల్యాణి డ్యామ్ నుంచి నీటి విడుదల... రైతుల్లో సంబరాలు

Water released from Kalyani Dam after fifteen years
  • ఇటీవల చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు
  • కల్యాణి డ్యామ్ కు జలకళ
  • డ్యామ్ పూర్తి సామర్థ్యం 895 అడుగులు
  • రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఇటీవల నివర్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలో అన్ని జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. రంగంపేట సమీపంలోని కల్యాణి డ్యామ్ కు కూడా జలకళ వచ్చింది. అంతేకాదు, 15 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు దిగువకు విడుదల చేశారు. దాంతో ఆయకట్టు ప్రాంతంలోని రైతుల్లో హర్షం వెల్లివిరిసింది. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

ఒకటిన్నర దశాబ్దకాలం పాటు ఈ ప్రాంతంలో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో డ్యామ్ పూర్తిస్థాయిలో నిండలేదు. అయితే, గత కొన్నివారాలు జిల్లాలో కురిసిన వర్షాలతో కల్యాణి డ్యామ్ కు భారీగా నీరు వచ్చి చేరింది. కల్యాణి డ్యామ్ పూర్తి సామర్థ్యం 895 అడుగులు కాగా, ఇవాళ రెండు గేట్లు ఎత్తి 50 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ, నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు నిండిందని, మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తనయుడు జగన్ సీఎంగా ఉన్న వేళ నిండిందని తెలిపారు.
Kalyani Dam
Chittoor District
Water
Chevireddy Bhaskar Reddy

More Telugu News