మరో దర్శకుడికి మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్!

04-12-2020 Fri 16:48
  • పరశురామ్ తో మహేశ్ 'సర్కారు వారి పాట'
  • వెంకీ కుడుముల కథకు గ్రీన్ సిగ్నల్
  • అదే కథను తిరస్కరించిన రామ్ చరణ్
Mahesh gives nod to another director

ఒక మంచి హిట్ సినిమా తీస్తే చాలు.. ఇక ఆ దర్శకుడుకి స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చేస్తున్నారు. అలాగే మంచి కథ చెప్పినా కూడా ఈవేళ స్టార్ హీరోలు కొత్త దర్శకులకి కూడా అవకాశాలు ఇస్తున్నారు. దర్శకుడు పరశురామ్ కి మహేశ్ బాబు అలాగే ఛాన్స్ ఇచ్చాడు. 'సర్కారు వారి పాట' కథ నచ్చడంతో మహేశ్ వెంటనే 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ కి ఓకే చెప్పేశాడు.

ఇదే కోవలో తాజాగా మరో దర్శకుడు వెంకీ కుడుములకు కూడా మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమధ్య నితిన్ హీరోగా 'భీష్మ' వంటి సూపర్ హిట్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మహేశ్ కి ఓ కథ చెప్పగా, వెంటనే ప్రొసీడ్ అవమని చెప్పినట్టు సమాచారం.

ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ కథను మరో హీరో రామ్ చరణ్ తిరస్కరించాడట. మహేశ్ ని కలవడానికి ముందు ఈ కథను చరణ్ కి వినిపించాడని, అయితే, ఆయనకు ఆ కథ నచ్చక 'నో' చెప్పాడని అంటున్నారు. దాంతో వెంకీ అదే కథను మహేశ్ కి చెప్పాడట. ఆయనకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.