అజాగ్రత్తగా ఉంటే వరల్డ్ క్రిమినల్ నెట్ వర్క్ చేతికి వ్యాక్సిన్: 194 దేశాలకు ఇంటర్ పోల్ హెచ్చరిక
- వ్యాక్సిన్ ను హైజాక్ చేసే ప్రయత్నంలో నేరగాళ్లు
- నకిలీలను చొప్పించడమే లక్ష్యంగా ప్రయత్నాలు
- 194 దేశాలను అలర్ట్ జారీ చేసిన ఇంటర్ పోల్
"ఇంటర్ పోల్ ఆరంజ్ నోటీసును జారీ చేస్తోంది. వ్యాక్సిన్ ను తప్పుదారి పట్టించి, డబ్బు సంపాదించేందుకు క్రిమినల్ గ్యాంగులు యత్నిస్తున్నాయి. వ్యాక్సిన్ డోస్ ల దొంగతనం, తమ వద్ద వ్యాక్సిన్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ మహమ్మారి ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వేళ నేరగాళ్ల పట్ల జాగురూకతతో ఉండాల్సిన సమయమిది. నేరస్తులకు, ఆన్ లైన్ మోసగాళ్లకు ఇప్పుడు వ్యాక్సిన్ రూపంలో ఓ అవకాశం లభించింది. దీన్ని అడ్డుకునేందుకు అన్ని దేశాలూ కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఇంటర్ పోల్ తన స్టేట్ మెంట్ లో పేర్కొంది.
ఈ మేరకు కొన్ని సాక్ష్యాలను ప్రదర్శించిన ఇంటర్ పోల్, క్రిమినల్స్ కొన్ని వ్యాపార ప్రకటనలు, తమ వద్ద వ్యాక్సిన్ ఉన్నట్టుగా ప్రముఖ కంపెనీల పేరిట వివిధ పేద దేశాలకు లేఖలు పంపాయని, వాటిని నమ్మవద్దని కూడా కోరింది. ఈ సమయంలో అన్ని దేశాలూ సమష్టిగా పనిచేసి, పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని, ఈ విషయంలో ఆరోగ్య నియంత్రణా సంస్థలు, లా అండ్ ఆర్డర్ విభాగాలూ కృషి చేయాలని ఇంటర్ పోల్ సెక్రెటరీ జనరల్ జుర్జెన్ స్టాక్ సూచించారు.