మరికాసేపట్లో తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు

04-12-2020 Fri 06:31
  • ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
  • 11 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం
  • 30 సర్కిళ్లలో 150 హాళ్లు సిద్ధం 
GHMC Election counting starts at 8 am

రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నెల 1న ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా, నేడు లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. 11 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,926 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్ సమయానికి వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకుని తొలుత వాటిని లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి లెక్కింపు ప్రారంభిస్తారు.

ఓట్ల లెక్కింపునకు మొత్తం 30 సర్కిళ్లలో 150 హాళ్లను సిద్ధం చేశారు. చాలా డివిజన్లలో ఓటింగ్ శాతం భారీగా తగ్గడంతో రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే మూడు రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.