స్కూళ్లు తెరవాలంటూ ముఖ్యమంత్రులను కోరిన సీఐఎస్సీఈ

03-12-2020 Thu 19:48
  • జనవరి 4 నుంచి స్కూళ్లు తెరవాలని సూచన
  • బోర్డు పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఉపయోగకరమన్న సీఐఎస్సీఈ
  • ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకునే అవకాశం ఉంటుందని వ్యాఖ్య
CISCE asks CMs to allow reopening of schools for classes 10 to 12

10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలు, కాలేజీలను పాక్షికంగానైనా తెరవాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ) కోరింది. జనవరి నాలుగు నుంచి విద్యాలయాలను తెరవాలని సూచించింది. దీని వల్ల బోర్డ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పింది. ఈ విషయాన్ని సీఐఎస్సీఈ సీఈవో ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

విద్యార్థులు క్లాసులకు హాజరైతే ప్రాక్టికల్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ వంటివి చేసుకోవచ్చని, క్లాసుల్లో ఉపాధ్యాయులతో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సీఈవో తెలిపారు. టీచర్లతో విద్యార్థులు నేరుగా సంభాషించే అవకాశం ఉంటుందని చెప్పారు.

కరోనా మహమ్మారి కారణంగా మార్చి నెల నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. అయితే ఆన్ లైన్ క్లాసుల ద్వారా ప్రస్తుతం విద్యా బోధన జరుగుతోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కు కూడా సీఐఎస్సీఈ ఓ విన్నపం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సహకరించాలని విన్నవించింది.