చేయనిది చేసినట్టుగా భ్రాంతి కలిగించే చంద్రబాబుకు ఇదే ఆఖరి టెర్మ్: విజయసాయిరెడ్డి

03-12-2020 Thu 19:32
  • చంద్రబాబు ఫేక్ అంటూ విజయసాయి వ్యాఖ్యలు
  • నోటికొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నాడని వెల్లడి
  • జనంలో పల్చనవుతున్నాడని విమర్శలు
Vijaysai Reddy says this is final term to Chandrababu

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. చేయనిది చేసినట్టుగా భ్రాంతి కలిగించే చంద్రబాబుకు రాజకీయంగా ఇదే ఆఖరి టెర్మ్ అని, రాజకీయంగా అవసాన దశలో ఉన్నారని పేర్కొన్నారు.

ఫేక్ అనే పదానికి ప్యాంటు, షర్టు, ముక్కుకు మాస్కు, చేతులకు గ్లోవ్స్ తొడిగితే అది చంద్రబాబేనని వ్యంగ్యంగా అన్నారు. ప్రజలు నీరాజనం పడుతున్న యువ ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్టు కామెంట్లు చేస్తూ జనంలో మరింత పల్చనవుతున్నాడని వ్యాఖ్యానించారు.

"జగన్ ఫేక్ సీఎం... గాలికి పోతాడు" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినప్పటి నుంచి వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి కొడాలి నాని కూడా చంద్రబాబును "ఫేక్ ప్రతిపక్ష నేత" అని అభివర్ణించారు.