నీకు సబ్జెక్ట్ పెద్దగా తెలియదు... ఇంకా అనుభవం రావాలని చెప్పా: సీఎం జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు

03-12-2020 Thu 17:18
  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన చంద్రబాబు
  • దిశ చట్టం నేపథ్యంలో విమర్శలు
  • ఏం తెలుసు నీకంటూ ఆగ్రహం
  • నేర్చుకోవాలన్న తపన లేదంటూ వ్యాఖ్యలు
Former CM Chandrababu take a dig at CM Jagan

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఫేక్ ప్రభుత్వం అని, దిశ చట్టం వ్యవహారంతో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. నాడు తెలంగాణలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా దిశ చట్టం తెస్తున్నామని, అసెంబ్లీలో ప్రకటించారని, ఘటన జరిగిన వెంటనే నిందితులను 24 గంటల్లో శిక్షిస్తాం అన్నారని చంద్రబాబు తెలిపారు. కానీ తాను ఆనాడే సీఎం జగన్ కు హితవు పలికానని అన్నారు. కొంచెం ఓపిక పట్టు, నీకు పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు అని నచ్చచెప్పేందుకు యత్నించానని వివరించారు.

"నీకు విషయం అర్థం కావడంలేదు, నువ్వు కొత్త ముఖ్యమంత్రివి, నీకు తెలియని సబ్జెక్టు ఇది అని చెప్పాను. నీకు నేర్చుకోవాలన్న తపన కూడా లేదు, పైగా అనుభవం కూడా లేదు, అంతకుముందు కూడా నువ్వు రాజకీయాల్లో చురుగ్గాలేవు అని చెప్పాను. కేసీఆర్ విషయం వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను. అనుభవంలేని వాడివి కాబట్టి నేర్చుకునేందుకు ఓపిక పట్టాలి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననడం తప్పు. సబ్జెక్టు గురించి ఏం తెలుసు నీకు? కనీసం బిజినెస్ రూల్స్ అంటే తెలుసా? హెచ్ఓడీ రూల్స్ తెలుసా, సచివాలయ రూల్స్ తెలుసా? ఏమీ తెలియవు నీకు!

ఎవడైనా చట్టం తెచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. ఇవేమీ చెయ్యకుండా చట్టాన్ని ఢిల్లీకి పంపించి ఇక్కడ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. బుద్ధి ఉన్నవాడెవడూ ఇలా చేయడు. నేను కట్టిన పోలీస్ స్టేషన్లకు రంగులేసుకుని రిబ్బన్ కట్ చేశారు. ఇలాంటి వాళ్లతో రాష్ట్రం పరువేం కావాలి! అతను అమాయకుడా, మనం అమాయకులమా, ప్రజలు అమాయకులో అర్థం కావడంలేదు.

ఇవాళ ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన మాటలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. భలే మాట్లాడాడు... ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని మార్చేయడానికే పుట్టాడంట! మేధావులు అతన్ని విమర్శించకూడదంట! రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి వాళ్లు రాబోయే రోజుల్లో సంక్షేమాన్ని ఇవ్వగలరా? అంబేద్కర్ ఆనాడే చెప్పారు.... పాలకుడు మంచివాడైతే రాజ్యాంగం అమలు సజావుగా జరుగుతుందని అన్నారు. రాజ్యాంగం మంచిదైనా పాలకుడు చెడ్డవాడైతే ప్రజలకు చెడే జరుగుతుందని చెప్పారు. జగన్ లాంటివాళ్లను చూసే అంబేద్కర్ ఆ విధంగా చెప్పారు" అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.