మరో నాలుగేళ్లలో మీ ముందు ఉంటా: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

03-12-2020 Thu 15:04
  • వైట్ హౌస్ లో క్రిస్మస్ పార్టీ ఇచ్చిన ట్రంప్
  • నాలుగేళ్లు అద్భుతంగా గడిచిపోయాయని వ్యాఖ్య
  • మరో నాలుగేళ్లు అధికారంలో ఉండేందుకు యత్నిస్తున్నామన్న ట్రంప్
Will See You In Four Years says Trump

తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిని అవుతాననే ధీమాను డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన జో బైడెన్ గెలుపును ఒప్పుకోవడానికి ట్రంప్ ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. యూఎస్ లోని పలు రాష్ట్రాల్లో ఆయన కేసులు వేశారు. అయితే, కోర్టులో కూడా ట్రంప్ కు నిరాశ ఎదురైంది. దీంతో, తదుపరి ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తున్నట్టు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైట్ హౌస్ లో ఇచ్చిన క్రిస్మస్ పార్టీలో అతిథులతో ఆయన మాట్లాడుతూ, గత నాలుగేళ్లు అద్భుతంగా గడిచాయని చెప్పారు. మరో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండేందుకు యత్నిస్తున్నాం. అది కుదరని పక్షంలో మరో నాలుగేళ్లలో మీ అందరినీ మళ్లీ కలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ పార్టీకి రిపబ్లికన్ పార్టీలోని కీలక వ్యక్తులు కూడా హాజరయ్యారు. మీడియాను ఈ సందర్భంగా అనుమతించలేదు. అయితే, ట్రంప్ మాట్లాడిన ఒక చిన్న వీడియో మాత్రం బయటకు వచ్చింది.