చేతులకు సంకెళ్లతో నారా లోకేశ్ నిరసన.. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు

03-12-2020 Thu 11:11
  • వైసీపీ పాలనలో రైతులకు సంకెళ్లు వేస్తున్నారంటూ ఆగ్రహం
  • రాక్షస పాలనలో రావణకాష్టం  
  • దళితులకు శిరోముండనం
  • మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకునేలా వేధించారు
lokesh slams ap govt

వైసీపీ పాలనలో రైతులకు సంకెళ్లు వేస్తున్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తన చేతికి సంకెళ్లు వేసుకుని ప్రభుత్వ తీరు పట్ల టీడీపీ నేతలతో కలిసి ఈ రోజు ఆయన నిరసన తెలిపారు. ఏపీలో వివిధ వర్గాలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని, అసెంబ్లీలోకి మీడియా నియంత్రణను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం నుంచి అసెంబ్లీ వరకు కాలినడకన ర్యాలీలో పాల్గొని ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా దాడులు ఆపాలని, అసెంబ్లీలోకి అన్ని మీడియా సంస్థలను అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు.  

‘రాక్షస పాలనలో రావణకాష్టం. 18 నెలల వైఎస్ జగన్ పాలనలో రైతులకు సంకెళ్లు, దళితులకు శిరోముండనం, మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకునేలా వేధించడం, మహిళలపై అఘాయిత్యాలు’ అని లోకేశ్ విమర్శించారు.

‘రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన తెలిపాం’ అని లోకేశ్ చెప్పారు.