Ravindra Jadeja: రవీంద్ర జడేజా... నీకు హ్యాట్సాఫ్: సంజయ్ మంజ్రేకర్ పొగడ్తల వర్షం

  • గతంలో జడేజాను విమర్శించిన మంజ్రేకర్
  • నిన్నటి మ్యాచ్ లో మనసు మార్చుకుని ప్రశంసలు
  • హార్దిక్, జడేజాలు భవిష్యత్ స్టార్స్ అని కితాబు
Manjrekar Praises Ravindra Jadeja

గత సంవత్సరం వరల్డ్ కప్ సమయంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తీవ్రంగా విమర్శించిన మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇప్పుడు మనసు మార్చుకుని పొగడ్తల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో భాగంగా 50 బంతుల్లోనే 66 పరుగులు సాధించిన జడేజాపై ఆ సమయంలో కామెంటేటర్ ప్యానల్ లో ఉన్న మంజ్రేకర్ కొనియాడాడు.

చివరి ఓవర్లలో జడేజా ఆడిన తీరు అద్భుతంగా ఉందని, అతన్ని ప్రశంసించకుండా ఉండలేకున్నానని అన్నాడు. ఆఫ్ సైడ్, లెగ్ సైడ్ షాట్లతో అలరించిన జడేజా ప్రదర్శనకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని, అతను ఓ అసాధారణ ఇన్నింగ్స్ ను కళ్ల ముందుంచాడని, భవిష్యత్తులో అతను ఇంకా మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ లో జడేజా ఎంతో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడని, బౌలర్ గా కూడా రాణిస్తే, అతని ఆటతీరుతో భారత్ మరిన్ని విజయాలను అందుకుంటుందని అభివర్ణించాడు.

ఇదే సమయంలో మరో ఆల్ రౌండర్, నిన్నటి మ్యాచ్ లో రాణించిన హార్దిక్ పాండ్యాను కొనియాడుతూ, ఒత్తిడికి గురయ్యే ప్రతి సమయంలోనూ, దాన్ని అధిగమించి, మంచి స్కోరు చేయడాన్ని పాండ్యా అలవాటు చేసుకుంటున్నాడని చెప్పాడు. అతని బ్యాటింగ్ వల్లే మూడవ వన్డేలో ఇండియా గౌరవ ప్రదమైన స్కోరును చేయడంతో పాటు విజేతగానూ నిలిచిందని, వీరిద్దరూ జట్టులో సమీప భవిష్యత్ స్టార్స్ అని సంజయ్ మంజ్రేకర్ కితాబిచ్చాడు.

More Telugu News