వీడు మామూలోడు కాదు.. నలుగురిని పెళ్లి చేసుకుని.. ఆరుగురితో సహజీవనం!

03-12-2020 Thu 10:40
  • నలుగురిని పెళ్లాడి ఇద్దరిని వదిలేసిన వైనం
  • మూడో భార్యను పరిచయం చేసి షాకిచ్చిన భర్త
  • నాలుగో భార్యను చంపేందుకు యత్నం
wife approached police against husband in Hyderabad

నలుగురిని పెళ్లి చేసుకుని ఆరుగురితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి బండారం బయటపడింది. భర్త అసలు విషయం తెలిసి విస్తుపోయిన భార్య తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది.

హిమబిందు అనే మహిళకు మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణప్యాలెస్‌కు చెందిన వెంకటబాలకృష్ణ పవన్‌కుమార్‌తో 2018లో వివాహమైంది. వివాహ సమయంలో కట్నం, ఇతర ఖర్చుల కింద అమ్మాయి తల్లిదండ్రులు రూ. 38 లక్షలు ఇచ్చారు. వివాహానంతరం దుబాయ్ తీసుకెళ్లిన పవన్ అక్కడ తనను వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అతనికి అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయని, తొలి ఇద్దరినీ వదిలేశాననీ చెప్పిన పవన్.. మూడో భార్యను తనకు పరిచయం చేశాడని పేర్కొంది. అంతేకాక, ఆమె తన నిజమైన భార్య అని చెప్పడంతో విస్తుపోయినట్టు తెలిపింది. తనపై వేధింపులు కొనసాగించడంతోపాటు చంపాలని కూడా చూశాడని ఆరోపించింది.

దీంతో ఏడాది క్రితం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అంతేకాక, మరో ఆరుగురితో సహజీవనం కూడా చేస్తున్నాడని ఆరోపించింది. పెళ్లి పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న పవన్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.