Kerala: కేరళ ప్రభుత్వం నుంచి అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్!

  • ఇకపై రోజుకు రెండు వేల మందికి స్వామి దర్శనం
  • వారాంతంలో 3 వేల మందికి అవకాశం
  • ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి
Good News for Sabarimala Piligrims

ప్రస్తుత మండల పూజలు, మకర విళక్కు సీజన్ లో కేరళలోని పశ్చిమ కనుమల్లో నెలకొన్న శబరిమల అయ్యప్పను దర్శించాలని భావించే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రోజుకు అనుమతిస్తున్న భక్తుల సంఖ్యను పెంచుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రోజుకు 1000 మంది, వారాంతంలో 2 వేల మందిని అనుమతిస్తుండగా, ఇకపై రోజుకు 2 వేల మందిని, శని, ఆదివారాల్లో 3 వేల మందిని అనుమతిస్తామని పేర్కొంది.

ఈ మేరకు కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లో టికెట్ ను ముందుగానే బుక్ చేసుకోవడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికీ కరోనా సర్టిఫికెట్ తప్పనిసరని ఆయన తెలిపారు. బేస్ క్యాంపు నుంచి సన్నిధానం వరకూ వెళ్లే దారిలో కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. భక్తులు కరోనా నిబంధనలన్నింటినీ పాటించాలని ఆయన సూచించారు.

కాగా, ఈ సీజన్ లో కార్తీకమాసం ప్రారంభమై, శబరిమల తలుపులు తెరచుకున్నా, అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తుల సంఖ్య చాలా పలుచగానే ఉంది. కరోనా భయాలతో చాలా మంది మాల వేసుకునేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. మాలలో ఉన్నవారిలో అత్యధికులు ఈ సంవత్సరం కేరళ వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, స్థానికంగా ఉన్న అయ్యప్ప ఆలయాల్లోనే దీక్షా విరమణలకు ఏర్పాట్లు చేస్తున్నామని గురుస్వాములు తెలియజేశారు. రవాణా సౌకర్యాల లభ్యత, ముఖ్యంగా పరిమత సంఖ్యలోనే తిరుగుతున్న రైళ్లు కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమైంది.

More Telugu News