జేమ్స్ బాండ్ 'గోల్డెన్ ఐ'లో చూపిన ప్యూర్టో రికో భారీ టెలిస్కోప్ నాశనం!

03-12-2020 Thu 09:43
  • 57 సంవత్సరాలుగా సేవలందించిన టెలిస్కోప్
  • కుప్పకూలిందని ప్రకటించిన యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్
  • ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
Massive Arecibo Telescope Collapsed

ప్యూర్టో రికోలోని అరీసిబో అబ్జర్వేటరీ నిర్వహణలో ఉన్న భారీ రేడియో టెలిస్కోప్ కుప్పకూలింది. గడచిన 57 సంవత్సరాలుగా సేవలందించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఈ టెలిస్కోప్ పూర్తిగా దెబ్బతిని పనికిరాకుండా పోయిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. 1995లో పియర్స్ బ్రాస్నన్ హీరోగా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'గోల్డెన్ ఐ'లో ఈ టెలిస్కోప్ ను చూపించారు.

దాదాపు 900 టన్నుల బరువైన ప్లాట్ ఫామ్ పై రిఫ్లెక్టర్ డిష్ ఆకారంలో ఉండే ఈ టెలిస్కోమ్ మంగళవారం ఉదయం కుప్పకూలిందని యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పేర్కొంది. గత ఆగస్టు నుంచి ఇది దెబ్బతినడం ప్రారంభమైందని, తాజా ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది.

ఈ టెలిస్కోప్ అంతరిక్షం నుంచి వచ్చే రేడియో తరంగాలను స్వీకరించేది. అంతరిక్షంలో మరేదైనా గ్రహంలో జీవం ఉందా? అన్న కోణంలో పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు, ఈ టెలిస్కోప్ ను ఎంతగానో వినియోగించారు. రిఫ్లెక్టర్ డిష్ ను నిలిపి ఉంచిన మెటల్ కేబుల్స్ తెగడం ఆగస్టులోనే ప్రారంభం అయిందని, వాటికి మరమ్మతు చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదని, దీంతో ల్యాబొరేటరీని మూసి వేశామని యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా అధికారులు వెల్లడించారు.

గత నవంబర్ లో ఎన్ఎస్ఎఫ్ కు చెందిన ఇంజనీర్ల బృందం ఈ టెలిస్కోప్ ను సందర్శించి, దీన్ని స్వయంగా తొలగిస్తేనే మేలని, దీని నిర్వహణ, మరమ్మతులు ప్రమాదకరమని తేల్చి చెప్పింది. టెలిస్కోప్ సపోర్ట్ టవర్స్ పూర్తిగా విఫలమయ్యాయని నిర్ధారించుకున్న తరువాతే వాడకాన్ని నిలిపివేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ టెలిస్కోప్ విఫలం మొత్తం ప్యూర్టో రికో ప్రజలను బాధించిందని, వారందరికీ దీనితో ఎంతో అనుబంధం ఉందని ఎన్ఎస్ఎఫ్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు.