అమూల్ పాల వెల్లువ విజయవంతం అవుతుందా? కాదా? అనే విషయంపై ఐవైఆర్ స్పందన

02-12-2020 Wed 18:53
  • ప్రధానమైన పాడి ప్రాంతాలు అమూల్ పరిధిలోకి రావు
  • ఈ సొసైటీలు అమూల్ పరిధిలోకి వస్తేనే ప్రాజెక్టు విజయవంతం అవుతుంది
  • మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీలు ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నాయి
IYR Krishna Rao response on Amul project

గుజరాత్ కు చెందిన అమూల్ పాల ఉత్పత్తుల సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఎంత వరకు విజయవంతం అవుతుందనే అంశంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. గత ప్రభుత్వాల కాలాలలో విశాఖ, కృష్ణ, సంగం ప్రాంతపు మిల్క్ డైరీలు ప్రభుత్వ పెట్టుబడులతో ఏర్పాటు చేసిన వసతులతో పాటు దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన నెట్ వర్క్ లను మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీల ముసుగులో కైవసం చేసుకున్నాయని ఆయన చెప్పారు.

పాడి విషయంలో ప్రధానమైన ఈ ప్రాంతాలు అమూల్ పరిధిలోకి రావని ఐవైఆర్ అన్నారు. ఈ సంఘాలు మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీల ముసుగులో వ్యాపార సంస్థల్లాగా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసుకొని నడుస్తూ ఉన్నాయని చెప్పారు. పాడి ఉత్పత్తికి ప్రధానమైన ఈ సొసైటీలు అమూల్ పరిధిలో లేనంత వరకు ఈ ప్రాజెక్టు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువని అన్నారు.