Chandrababu: కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే.. వైయస్ విగ్రహం పెడతారా?: చంద్రబాబు ఫైర్

Chandrababu comments on YSR statue at Polavaram project
  • పోలవరంలో అవినీతి జరిగిందని చెపుతున్నవారు ఎందుకు నిరూపించలేక పోతున్నారు?
  • గతంలో మేము చెప్పిన అంచనాలనే ఇప్పుడు చెప్పుకుంటున్నారు
  • వైయస్ విగ్రహ ప్రతిపాదనతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి
పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నవారు... దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి నష్టం చేకూర్చారని అన్నారు. గతంలో తాము వేసిన అంచనాలను తప్పుపట్టారని... ఇప్పుడు అవే అంచనాలను కరెక్ట్ అంచనాలని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ అవినీతిపరుడు కాబట్టి అందరిపై అవినీతి ముద్ర వేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారని... దాని సంగతేమైందని ప్రశ్నించారు.

గోదావరి నీళ్లను తెలంగాణ మీదుగా శ్రీశైలానికి తెస్తామని జగన్ చెప్పినప్పుడు అది కుదిరే పని కాదని తాను చెప్పానని... తాను చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఈ ప్రశ్నలు అడిగితే తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు.

 కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును కడుతూ, అక్కడ వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? అని దుయ్యబట్టారు. వైయస్ విగ్రహం పెడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. వైయస్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనతో పోలవరంకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని చెప్పారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Polavaram Project

More Telugu News