అమరావతికి బీజేపీ పూర్తి మద్దతు పలుకుతోంది: సోము వీర్రాజు

02-12-2020 Wed 14:03
  • విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం
  • మోదీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • రోడ్ల దుస్థితిపై ఈ నెల 5న ఆందోళన కార్యక్రమం చేపడతాం
BJP supports Amaravati says Somu Veerraju

ఏపీలో రాజధాని అంశం కాక పుట్టిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానులను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని టీడీపీ సహా ఇతర విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, రాజధానిగా అమరావతికి బీజేపీ పూర్తి మద్దతు పలుకుతోందని చెప్పారు.

త్వరలోనే విజయవాడలో రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వీర్రాజు తెలిపారు. గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీని అప్పులపాలు చేశాయని మండిపడ్డారు. 30 లక్షల ఇళ్లను పేదలకు ఇస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోందని... వాటిలో కేంద్ర ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను ఇస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని... రోడ్ల దుస్థితిపై ఈ నెల 5న ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పారు.