Telangana: హైదరాబాదులో 4వ తేదీ నుంచి సినిమా హాల్స్ తెరుస్తున్నామన్న యాజమాన్యాలు!

  • తొలి చిత్రంగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'టెనెంట్'
  • తెరచుకోనున్న 80 శాతం మూవీ స్క్రీన్లు
  • సంక్రాంతి నాటికి వ్యాపారం పుంజుకుంటుందన్న ఆశ
Movie Theaters to Reopen on 4th in Telangana

దాదాపు ఎనిమిది నెలల సినీ ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడనుంది. శుక్రవారం నుంచి హైదరాబాద్ నగరంలో వెండి తెర వెలుగు జిలుగులు ప్రత్యక్షం కానున్నాయి. కరోనా కారణంగా మార్చిలో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ లాక్ మార్గదర్శకాల మేరకు మల్టీ ప్లెక్స్ లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను సైతం తిరిగి ప్రారంభించనున్నామని థియేటర్ల యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

ఇక తొలి చిత్రంగా క్రిస్టొఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'టెనెంట్'తో పాటు ఇప్పటికే విజయవంతమైన కొన్ని చిత్రాలను సినిమా హాల్స్ ప్రదర్శించనున్నాయి. గత నెలలో థియేటర్లను తిరిగి తెరిచేందుకు, సినిమా షూటింగ్స్ నిర్వహించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతించిన సంగతి తెలిసిందే. ఆపై సమావేశమైన థియేటర్ల యాజమాన్యాలు, 4వ తేదీన మూవీ హాల్స్ తెరవాలని నిర్ణయించాయి.

కరోనా మహమ్మారి విజృంభించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం నాడు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్, సినీపోలిస్, ఏఎంబీ సినిమాస్ లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, లాక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ తదితరాల్లో విడుదలైన చిత్రాలను తిరిగి థియేటర్లలో విడుదల చేసేందుకు మాత్రం అనుమతి లభించలేదని తెలుస్తోంది.

థియేటర్ల తిరిగి ప్రారంభంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి విజేందర్ రెడ్డి స్పందిస్తూ, రాష్ట్రంలోని మల్టీ ప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 80 శాతం వరకూ తిరిగి సినిమా ప్రదర్శనలను ప్రారంభించనున్నాయని, తెలుగులో సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బతుకే సో బెటర్' సినిమా తొలుతగా విడుదల కానుందని తెలిపారు. క్రిస్మస్,సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాలతో మూవీ ఇండస్ట్రీ తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో హైదరాబాద్ లో ప్రముఖ థియేటర్లయిన సుదర్శన్ 35 ఎంఎం, దేవీ 70 ఎంఎం యజమాని, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రెటరీ బాల్ గోవింద్ రాజ్ మాట్లాడుతూ, అన్ని కరోనా నిబంధనలను పాటిస్తూ, ప్రేక్షకులను తిరిగి థియేటర్ల వైపు నడిపించేందుకు అన్ని ప్రయత్నాలనూ సాగిస్తామని తెలిపారు. తెలంగాణలో 600 స్క్రీన్లు ఉండగా, ఒక్క హైదరాబాద్ లోనే 70 మల్టీప్లెక్స్ స్క్రీన్లు సహా 175 మూవీ స్క్రీన్లు ఉన్నాయి. వీటిల్లో కనిష్ఠంగా 400 నుంచి గరిష్ఠంగా 1,300 వరకూ సీటింగ్ కెపాసిటీ ఉంది.

More Telugu News