హాలీవుడ్ సినిమా చేయనున్న ప్రముఖ తమిళ దర్శకుడు

01-12-2020 Tue 21:23
  • తమిళంలో పలు హిట్ సినిమాలు చేసిన మురుగదాస్ 
  • తెలుగులో స్టాలిన్, స్పైడర్ సినిమాలు     
  • డిస్నీ సంస్థ నిర్మించే చిత్రానికి దర్శకత్వం 
  • యాక్షన్ కమ్ యానిమేషన్ తరహా సినిమా  
AR Murugadas to make Hollywood film

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గురించి ఈవేళ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజిక సమస్యలను వినోదంతో రంగరించి కొత్తగా చెప్పడంలో సిద్ధహస్తుడు. తమిళంలో స్టార్ హీరోలతో ఆయన చేసిన సినిమాలు రికార్డులు సృష్టించాయి. అలాగే, తెలుగులో చిరంజీవితో 'స్టాలిన్', మహేశ్ బాబుతో 'స్పైడర్' చిత్రాలను కొత్త పంథాలో రూపొందించి పేరుతెచ్చుకున్నాడు.

ఇప్పుడీ అగ్రదర్శకుడు హాలీవుడ్ ప్రవేశం చేయనున్నట్టుగా గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ పిక్చర్స్ బ్యానర్లో ఓ హాలీవుడ్ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట.

ఈ చిత్రాన్ని యాక్షన్ కమ్ యానిమేషన్ తరహాలో రూపొందిస్తారని సమాచారం. 'జంగిల్ బుక్', 'ది బ్యూటీ అండ్ ది బీస్ట్' తరహా జోనర్లో ఇది ఉంటుందని అంటున్నారు. ఇదే కనుక వాస్తవ రూపం దాల్చితే.. ఒక దక్షిణాది దర్శకుడు హాలీవుడ్ అగ్ర సంస్థలో చిత్రాన్ని చేయడం అన్నది నిజంగా గర్వకారణమే అవుతుంది.