నీరవ్ మోదీ రిమాండ్ ను పొడిగించిన లండన్ కోర్టు

01-12-2020 Tue 20:54
  • నీరవ్ ను అప్పగించాలని కోరిన భారత్
  • నీరవ్ ను వీడియో లింక్ ద్వారా విచారించిన కోర్టు
  • రిమాండ్ ను మరో 28 రోజులు పొడిగించిన మేజిస్ట్రేట్
London court extends Nirav Modis remand

పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ 2 బిలియన్ డాలర్ల మేర మోసం చేసి దేశం విడిచి చెక్కేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్ లోని వాండ్స్ వర్త్ జైల్లో ఉన్నారు. ఈరోజు ఆయనను లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించింది. ఆయన రిమాండ్ ను మరికొంత కాలం పొడిగించింది.

నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత్ చేసిన అభ్యర్థనపై ఈరోజు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుథ్ నాట్ వీడియో లింక్ ద్వారా విచారించారు. నీరవ్ రిమాండ్ ను మరో 28 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఆమె తెలిపారు. అంటే ఈనెల 29 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. దీంతో భారత్ చేసిన అభ్యర్థనపై తుది విచారణను జనవరి 7, 8 తేదీలతో జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.