పాదరక్షల తయారీ దిగ్గజం 'బాటా' సీఈవోగా భారతీయుడు... కంపెనీ చరిత్రలో ఇదే ప్రథమం

01-12-2020 Tue 19:58
  • 'బాటా' గ్లోబల్ సీఈవోగా సందీప్ కటారియా
  • ఇప్పటివరకు గ్లోబల్ సీఈవోగా వ్యవహరించిన నాసార్డ్
  • నూతన నియామకం తనకు దక్కిన గౌరవమన్న కటారియా
Sandeep Kataria appointed as Bata Global CEO

పాదరక్షల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న కంపెనీ 'బాటా'. స్విట్జర్లాండ్ కు చెందిన 'బాటా' ప్రత్యేకత ఏంటంటే ఏ దేశంలో వ్యాపారం చేస్తుంటే ఆ దేశానికి చెందిన కంపెనీయే అన్నట్టుగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. భారత్ తో కూడా 'బాటా'కు అలాంటి అనుబంధమే ఉంది. అయితే, ఈ సంస్థను స్థాపించింది 1894లో కాగా, ఈ 126 ఏళ్ల కాలంలో తొలిసారిగా ఓ భారతీయుడు సంస్థ సీఈవోగా నియమితులయ్యారు.

ఇప్పటివరకు 'బాటా ఇండియా' విభాగం సీఈవోగా వ్యవహరిస్తున్న సందీప్ కటారియాను సంస్థ యాజమాన్యం గ్లోబల్ సీఈవోగా నియమించింది. 'బాటా'లో మరే భారతీయుడు ఇంతటి అత్యున్నత పదవిని అధిష్ఠించలేదు. 2016లో 'బాటా' గ్లోబల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అలెక్సిస్ నాసార్డ్ పదవీవిరమణతో ఆయన స్థానంలో సందీప్ కటారియా పగ్గాలు అందుకుంటున్నారు. దీనిపై కటారియా స్పందిస్తూ, కంపెనీ ఆదాయాన్ని, స్ధిరమైన అభివృద్ధిని ఇనుమడింపచేస్తానని చెప్పారు. ఈ నూతన నియామకాన్ని తనకు లభించిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.