అతని ప్రాణం పోయి ఉంటే ఏమయ్యేది? మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేయండి: సీపీఐ నారాయణ

01-12-2020 Tue 18:12
  • కేపీహెచ్బీ కాలనీలో పువ్వాడను అడ్డుకున్న బీజేపీ
  • వాహనంపై నుంచి కిందపడిపోయిన ఒక కార్యకర్త
  • పువ్వాడపై కేసు నమోదు చేయాలన్న నారాయణ
CPI Narayana fires on Puvvada Ajay Kumar

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం కేపీహెచ్బీ కాలనీలోని ఫోరం మాల్ సమీపంలో మంత్రి పువ్వాడ అజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓటర్లకు టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని అప్పటికే బీజేపీ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.

 అదే సమయంలో పువ్వాడ వాహనం ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండటంతో బీజేపీ శ్రేణులు వాహనాన్ని అడ్డుకున్నాయి. పువ్వాడ కాన్వాయ్ లోని వాహనాన్ని ధ్వంసం చేశాయి. ఇదే సమయంలో పువ్వాడ వాహనం బానెట్ పై ఒక కార్యకర్త పడుకోగా ఆ వాహనాన్ని వేగంగా ముందుకు దూకించారు. ఇదే సమయంలో మరో కార్యకర్త వాహనంపై నుంచి కిందకు పడ్డారు.

ఈ నేపథ్యంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ మాట్లాడుతూ, వాహనం నుంచి కిందకు పడిన వ్యక్తి చనిపోయి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పువ్వాడను వెంటనే బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. పిరికివాడిలా పువ్వాడ పారిపోయారని... ఇది టీఆర్ఎస్ కు సిగ్గుచేటని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్థానికేతరులు హైదరాబాదులో ఉండరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించిందని... స్థానికేతరుడైన పువ్వాడకు కేపీహెచ్బీ కాలనీలో ఏం పని అని ప్రశ్నించారు. పువ్వాడపై పోలీస్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.