ఎట్టకేలకు స్పందించిన కేంద్రం... ఢిల్లీలో రైతు నేతలతో చర్చలు ప్రారంభం

01-12-2020 Tue 16:43
  • కొన్నిరోజులుగా హస్తిన సరిహద్దుల్లో రైతుల నిరసన
  • విజ్ఞాన్ భవన్ లో రైతులతో కేంద్రమంత్రుల సమావేశం
  • చట్టాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్న కేంద్రం
Centre held meeting with farmers in Delhi

కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో రైతు సంఘాల నేతలు, రైతులు దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల పట్ల కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్రమంత్రి పియూష్ గోయల్ రైతు నేతలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా ఈ చర్చలు జరగుతున్నాయి.

ప్రస్తుతం పంజాబ్ కు చెందిన రైతు నేతలతో ఈ సమావేశం జరుగుతోంది. అనంతరం కేంద్రమంత్రులు హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రైతులతో సమావేశం కానున్నారు. కాగా, సమావేశాలకు ముందు కేంద్రమంత్రి తోమర్ మాట్లాడుతూ, రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు తాము సుముఖంగా ఉన్నామని చెప్పారు. కాగా, చర్చల సందర్భంగా నూతన చట్టాల పట్ల రైతుల్లో అవగాహన కలిగించాలని కేంద్రం ప్రయత్నించనుంది.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్లతో వేల సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేసి నిరసనలు తెలుపుతున్నారు. రోడ్లపైనే వంటావార్పూ చేసుకుంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి రైతులతో కేంద్రం చర్చలు ఎల్లుండి జరగాల్సి ఉన్నా, కరోనా, చలి తీవ్రత రీత్యా రెండ్రోజుల ముందే నిర్వహిస్తున్నారు.