ఫార్ములా వన్ ఛాంపియన్ హామిల్టన్ కు కరోనా

01-12-2020 Tue 14:58
  • గత వారంలో మూడు సార్లు టెస్ట్ చేస్తే నెగెటివ్ వచ్చిన వైనం
  • సోమవారం హామిల్టన్ లో కనిపించిన కరోనా లక్షణాలు
  • ఆదివారం బహ్రెయిన్ గ్రాండ్ ప్రి సాధించిన హామిల్టన్
Formula One World Champion Lewis Hamilton Tests Positive For Corona

సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి అందరినీ పలకరిస్తోంది. ఇప్పటికే ఎందరో దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ కు కరోనా సోకింది. ఏడు సార్లు ఫార్మలా వన్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర పుటల్లోకి ఎక్కిన హామిల్టన్ కరోనా బారిన పడ్డాడు. గత వారంలో హామిల్టన్ కు మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి నెగెటివ్ అని వచ్చింది.

మొన్న ఆదివారం కూడా బహ్రెయిన్ గ్రాండ్ ప్రిని హామిల్టన్ సాధించాడు. అయితే సోమవారం ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో, పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో బహ్రెయిన్ లోనే ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. హమిల్టన్ లో కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు. కరోనా సోకిన నేపథ్యంలో సాఖిర్ గ్రాండ్ ప్రికి హామిల్టన్ దూరమవుతున్నట్టు మెర్సిడెజ్ ఏఎంసీ పెట్రొనాస్ టీమ్ తెలిపింది.